ఎరుమేలి నుండి మకరజ్యోతి వరకు ,పెద్దపాదం మార్గంలోని ప్రతి మజిలీ మనలోని ఏ దుర్గుణాన్ని తొలగిస్తుందో వివరణ.
ఓం శ్రీ గురుభ్యో నమః ।
శ్రీ మహాగణాధిపతయే నమః ।
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ॥
శ్రీ ధర్మశాస్తాను దర్శించి తరించగోరే భక్తులు ఎటువంటి కష్టాలనైనా ఓర్పుతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని, అహంకార, మద, మాత్సర్యాలను విడనాడి, మాల ధరించి, మండల కాలం దీక్ష వహించి, అష్టరాగాలు, పంచజ్ఞానేంద్రియాలు, త్రిగుణాలు, విద్యా-అవిద్యలను అధిగమించి, ఇరుముడి కట్టుకుని శిరస్సుపై నిడుకొని, “ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప” అంటూ శబరిమల యాత్రకు బయలుదేరుతారు.
ఆ మార్గంలోని ప్రతి మజిలీకి ఒక అంతరార్థం ఉంది:
| # | మజిలీ | అంతరార్థం, ఆచారం |
|---|---|---|
| 1 | ఎరుమేలి | అహంకారాన్ని పోగొట్టే స్థలం. వావర్ స్వామి దర్గా నుండి పేటతుళ్ళి ఆడి, యోగ్యవసతి సెలయేటిలో స్నానం చేసి పేట్టశాస్తాను దర్శించాలి. |
| 2 | కాళైకట్టి ఆశ్రమం | కాలినడకన మహారణ్యంలోకి ప్రవేశించి, కోట్టప్పడి దాటి, పేరూరుతోడులో చేపలకు బొరుగులు చల్లి చేరే స్థలం. |
| 3 | అళుదా నది | పశ్చాత్తాపాన్ని కలిగించే నది. ఇక్కడ స్నానం చేసి, రెండు రాళ్ళను తీసుకోవాలి. |
| 4 | అళుదామేడు, కల్లిడుంకుండ్రు | అధర్మ ప్రవర్తనను పోగొట్టే ఎక్కుడు. ఆ రెండు రాళ్ళను కల్లిడుంకుండ్రులో విసర్జించాలి. |
| 5 | ఇంజిప్పారకోట్ట, ముక్కుళి | క్రోధాన్ని నశింపజేసే ఇంజిప్పారకోట్టను దాటి, ముక్కుళి అమ్మవారిని (వనదేవత) దర్శించాలి. |
| 6 | కరిమల మెట్టు | స్వార్థం, లోభం, వంచన వంటి దుర్గుణాలను దరిచేరనివ్వని కఠినమైన ఎక్కుడు. |
| 7 | కరిమల ఇరక్కం, పెరియానవట్టం | మనోబలాన్ని కలిగించే దిగుడు. పందళరాజుకు స్వామి దొరికిన పవిత్ర స్థలం పెరియానవట్టంలో తిరువాభరణం పెట్టెలకు జరిగే పూజలో పాల్గొని నమస్కరించాలి. |
| 8 | పంబా నది | సిరియానవట్టం మీదుగా పంబ చేరి, పవిత్ర పంబలో స్నానం, పంబావిళక్కు (దీపం) విడిచిపెట్టడం, పంబాసద్య (భోజనం), శ్రీ పంబా గణపతి, పందళ రాజు దర్శనం. |
| 9 | నీలిమల, అప్పాచిమేడు | వైరాగ్యభావాన్ని కలిగించే నిటారైన నీలిమల ఎక్కి, విజయరూపమైన అప్పాచిమేడు వద్ద లోయల్లోని యక్షిణులకు బెల్లపు ఉండలు వేయాలి. |
| 10 | శబరి పీఠం | శబరి తపస్సు చేసి ముక్తిని పొందిన పుణ్యస్థలం. |
| 11 | శరంగుత్తి | పవిత్ర వటవృక్షం వద్ద శరం (బాణం), కత్తి వంటి ఆయుధాలను విసర్జించాలి. |
| 12 | సన్నిధానం – 18 మెట్లు | మానవులలో వ్యాపించియుండే దుర్గుణాలను ఒక్కొక్కటి తొలగించి, వాటి స్థానంలో సద్గుణాలను ఆవాహించే పుణ్యసోపానాలు — పావన పదునెనిమిది మెట్లను ఇరుముడితో ఎక్కి శ్రీ శబరిగిరీశుని దర్శించాలి. |
| 13 | కన్నిమూల గణపతి, మాళికాపురత్తమ్మ | కన్నిమూల మహాగణపతికి, నాగరాజుకు మొక్కి, మాళికాపురత్తమ్మను దర్శించి, కొబ్బరికాయను గుడి చుట్టూ మూడుసార్లు దొర్లించి విడవాలి — దీనిని “నారికేళ వళిపాడు” అంటారు. |
| 14 | భస్మకుళం, నెయ్యాభిషేకం, మకరజ్యోతి | భస్మకుళంలో స్నానం చేసి, ఇరుముడి విప్పి, స్వామికి ఆజ్యాభిషేకం (నెయ్యి అభిషేకం) చేయించి, తన్మయత్వంతో మకరజ్యోతిని కన్నులారా గాంచి, శ్రీ ధర్మశాస్తాను శరణు జొచ్చిన జన్మమే పవిత్రమైన జన్మ. |
సర్వులు శ్రీ అయ్యప్పస్వామి వారిని దర్శించుకొని సత్ఫలితాలు పొంది తరింతురు గాక! సర్వేషాం మహాజనానాం సమస్త మంగళాని భవంతు.
ఆధారం: “శ్రీ అయ్యప్పస్వామి పూజా విధానము”.



[…] శ్రీ ధర్మశాస్తాను దర్శించే భక్తుల పవ… […]
[…] శ్రీ ధర్మశాస్తాను దర్శించే భక్తుల పవ… […]