మాలాధారణ అనంతరం ప్రారంభించవలసిన పూజ, నిత్య విధులు, శనివారపు పూజ, పడిపూజ, ఇరుముడి, శబరిమల యాత్ర, మాలా విసర్జన , 41 రోజుల మండల దీక్షా విధానం దశలవారీగా ఒకే చోట.
సంక్షిప్తంగా: మాలాధారణ రోజు సాయంత్రం నుండే పూజ ప్రారంభమవుతుంది. ప్రతి పూజ గణపతి పూజతోనే ప్రారంభమవుతుంది. 41 రోజులూ ఉదయం, సాయంత్రం సులభ నిత్య పూజ చేయండి. శనివారాలు, ప్రత్యేక రోజుల్లో వేదోక్త పూర్తి పూజ చేయండి. దీక్షలో ఒకసారి గురుస్వామితో కలిసి పడిపూజ జరుపుకోండి.
దశ 0 – మాల వేసుకునే ముందు (సిద్ధత)
- గురుస్వామిని ఎంచుకోండి. దీక్షా నియమాలు, మంత్రాలు ఆయన దగ్గరే నేర్చుకోవాలి.
- యాత్ర తేదీ నిర్ణయించుకొని, కనీసం 41 రోజులు వెనక్కి లెక్కించి మాలాధారణ తేదీ నిర్ణయించుకోండి — ఈ ఏడాది శబరిమల తేదీలు.
- సిద్ధం చేసుకోండి: తులసి / రుద్రాక్ష మాల (అయ్యప్ప ముద్రతో), నలుపు/నీలం/కాషాయం వస్త్రాలు 2–3 జతలు, తువ్వాలు, చాప, అయ్యప్ప పటం, పూజా సామగ్రి.
- దీక్షా నియమావళి పూర్తిగా చదవండి; ఇంట్లో వారికి, పని చోట ముందుగానే చెప్పండి.
- ఇంట్లో ఈశాన్య మూలలో పూజా స్థలం శుభ్రం చేసి సిద్ధం చేయండి — పూజా నియమాలు.
దశ 1 – మాలాధారణ రోజు
- సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి, దీక్షా వస్త్రాలు ధరించండి.
- మాల, పండ్లు, తమలపాకులు, దక్షిణతో గుడికి లేదా గురుస్వామి ఇంటికి వెళ్ళండి.
- గురుస్వామి గణపతి పూజ చేసి మాలను పూజిస్తారు; మీరు మాలాధారణ మంత్రం, ప్రతిజ్ఞ చెబుతారు.
- గురుస్వామి మీ మెడలో మాల వేస్తారు — ఈ క్షణం నుండి మీరు “స్వామి”. గురుస్వామికి నమస్కరించి దక్షిణ సమర్పించండి.
- అదే రోజు సాయంత్రం ఇంట్లో మొదటి పూజ: సులభ నిత్య పూజ, తరువాత 108 శరణు ఘోష, హరివరాసనం.
దశ 2 – 41 రోజులూ ప్రతిరోజు
| సమయం | ఏం చేయాలి |
|---|---|
| సూర్యోదయానికి ముందు | లేవగానే “స్వామియే శరణం అయ్యప్ప” అనండి. చిన్నటి స్నానం, విభూతి/గంధం/కుంకుమ; మాలకు గంధం. |
| ఉదయం పూజ | నిత్యప్రార్థన → సులభ నిత్య పూజ (గణపతి → లక్ష్మి → అయ్యప్ప) → 108 శరణు ఘోష → హారతి. |
| పగలు | నియమాలతో పని; వీలైతే గుడి దర్శనం; మధ్యాహ్నం ఒక పూట భోజనం (ఏకభుక్తం); మనసులో శరణం ఫోకస్. |
| సాయంత్రం (సూర్యాస్తమయం తరువాయి) | మళ్లీ స్నానం, దీపారాధన, ఉదయం లాగే సులభ పూజ లేదా భజన; పంచరత్నం, శరణు ఘోష. |
| రాత్రి | అల్పాహారం మితమే; హరివరాసనం వినీ/పాడి నేల మీద చాప పై నిద్ర. |
దశ 3 – రోజువారీ పూజా విధానం
| ఎప్పుడు | ఏ పూజ | ఎవరు |
|---|---|---|
| ప్రతిరోజు ఉదయం, సాయంత్రం | సులభ నిత్య పూజ | స్వాములందరూ – ముఖ్యంగా కన్నె స్వాములు |
| శనివారాలు; మాలాధారణ అనంతరం మొదటి శనివారం; మాసశివరాత్రి / ఉత్తర నక్షత్రం | వేదోక్త పూర్తి షోడశోపచార పూజ + వీలైతే అభిషేకం | మంత్రాలు చదవగలిగినవారు / గురుస్వామి సమక్షంలో |
| దీక్షలో ఒకసారి (సాధారణంగా 3వ–5వ వారం) | దివ్య పడిపూజ – 18 మెట్ల పూజ, భజన, అన్నదానం | గురుస్వామి ఆధ్వర్యంలో, స్వాములందరూ కలిసి |
| కార్తీక సోమవారాలు, మండల పూజ రోజు | పూర్తి పూజతో పాటు రుద్రం, లింగాష్టకం, దీపారాధన | వీలైనవారు |
| యాత్రకు ముందు రోజు | ఇరుముడి కట్టు – గురుస్వామి సమక్షంలో పూజ, నెయ్యి కొబ్బరికాయ నింపడం | యాత్ర చేసే స్వాములందరూ |
సులభ పూజ, వేదోక్త పూజ – రెండూ షోడశోపచార పూజలే; తేడా మంత్రాల్లో మాత్రమే. సులభ పూజలో “సమర్పయామి” నామాలు, వేదోక్త పూజలో పురుషసూక్తం వంటి వేద మంత్రాలు ఉంటాయి. మంత్రాలు రాకపోయినా భక్తితో చేసే సులభ పూజ సంపూర్ణ ఫలాన్ని ఇస్తుంది.
దశ 4 – పూర్తి (వేదోక్త) పూజా క్రమం
- పూజా ప్రారంభం — దీపారాధన, ప్రార్థనలు
- ఆచమనం, ప్రాణాయామం — శుద్ధి
- సంకల్పం — ఈ రోజు పంచాంగంతో
- కలశారాధన
- విఘ్నేశ్వర పూజ — ఎప్పుడూ గణపతి మొదట
- అయ్యప్పస్వామి పూజ — ధ్యానం, ఆవాహనం నుండి
- పంచామృత అభిషేకం
- అలంకారం, అంగపూజ, అష్టోత్తరం
- ఉత్తరాంగ పూజ — ధూప, దీప, నైవేద్య, హారతి, మంత్రపుష్పం
- క్షమాపణ, ఉద్వాసన — పూజ ముగింపు
దశ 5 – యాత్రకు ముందు: ఇరుముడి
- 41 రోజుల దీక్ష పూర్తయ్యాకే ఇరుముడి కడతారు – సాధారణంగా ప్రయాణానికి ముందు రోజు, గుడిలో లేదా గురుస్వామి ఇంట్లో.
- గురుస్వామి ఇరుముడి మంత్రం చెబుతుండగా స్వామి స్వయంగా ముద్ర కొబ్బరికాయలో నెయ్యి పోస్తారు – ఇరుముడి, నెయ్యి కొబ్బరికాయ.
- కన్నె స్వామి ఇరుముడిని తానే ఎత్తకూడదు, దించకూడదు; గురుస్వామి లేదా పెద్ద స్వామి చేస్తారు.
- ఇరుముడి తలపై పెట్టుకున్నాక వెనక్కి తిరిగి చూడకుండా, శరణు ఘోషతో బయలుదేరండి.
దశ 6 – శబరిమల యాత్ర
దారిలో కొబ్బరికాయలు కొట్టే 13 స్థలాలు, ఎరుమేలి నుండి సన్నిధానం వరకు దారి, ప్రతి మజిలీ అంతరార్థం – శబరిమల యాత్ర, యాత్రా మార్గ అంతరార్థం. ఇరుముడితో మాత్రమే పదునెట్టాంబడి ఎక్కి, నెయ్యాభిషేకం చేయించండి. దారి పొడవునా శరణమాల పలుకుతూ నడవండి.
దశ 7 – ఇంటికి తిరిగి వచ్చాక: మాలా విసర్జన
- ఇంటికి చేరగానే ప్రసాదం (అరవణ, అప్పం, నెయ్యి, విభూతి) పూజా స్థలంలో ఉంచి హారతి ఇవ్వండి; కుటుంబానికి ప్రసాదం పంచండి.
- ఇరుముడి కట్టిన గుడికే వెళ్ళి కొబ్బరికాయ కొట్టి, గురుస్వామి సమక్షంలో మాలా విసర్జన మంత్రంతో మాల తీయించుకోండి.
- గురుస్వామికి గురుదక్షిణ సమర్పించి ఆశీర్వాదం తీసుకోండి.
- మాలను పూజా స్థలంలో భద్రపరచండి; దీక్షలో నేర్చుకున్న క్రమశిక్షణను జీవితాంతం కొనసాగించండి.
దీక్షలో ఆటంకాలు ఎదురైనప్పుడు
- ఇంట్లో జననం లేదా మరణం జరిగితే: అశౌచ నియమాలు, మాలా విసర్జన పుట చూసి వెంటనే గురుస్వామిని సంప్రదించండి.
- పూజ ఒక పూట తప్పితే: మరుసటి పూటలో క్షమాపణ ప్రార్థన చెప్పి, శరణు ఘోష 108 సార్లు చేయండి.
- అనారోగ్యం ఉంటే: చన్నీటి స్నానం, ఉపవాసం వంటి నియమాల్లో గురుస్వామి అనుమతితో సడలింపు తీసుకోవచ్చు; భక్తి, సత్యం, సదాచారం మాత్రం వదలకండి.


