శ్రీ ధర్మశాస్తాను దర్శించే భక్తుల పవిత్రత – యాత్రా మార్గం అంతరార్థం

2

ఎరుమేలి నుండి మకరజ్యోతి వరకు ,పెద్దపాదం మార్గంలోని ప్రతి మజిలీ మనలోని ఏ దుర్గుణాన్ని తొలగిస్తుందో వివరణ.

ఓం శ్రీ గురుభ్యో నమః ।
శ్రీ మహాగణాధిపతయే నమః ।
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ॥

శ్రీ ధర్మశాస్తాను దర్శించి తరించగోరే భక్తులు ఎటువంటి కష్టాలనైనా ఓర్పుతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని, అహంకార, మద, మాత్సర్యాలను విడనాడి, మాల ధరించి, మండల కాలం దీక్ష వహించి, అష్టరాగాలు, పంచజ్ఞానేంద్రియాలు, త్రిగుణాలు, విద్యా-అవిద్యలను అధిగమించి, ఇరుముడి కట్టుకుని శిరస్సుపై నిడుకొని, “ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప” అంటూ శబరిమల యాత్రకు బయలుదేరుతారు.
ఆ మార్గంలోని ప్రతి మజిలీకి ఒక అంతరార్థం ఉంది:

# మజిలీ అంతరార్థం, ఆచారం
1 ఎరుమేలి అహంకారాన్ని పోగొట్టే స్థలం. వావర్ స్వామి దర్గా నుండి పేటతుళ్ళి ఆడి, యోగ్యవసతి సెలయేటిలో స్నానం చేసి పేట్టశాస్తాను దర్శించాలి.
2 కాళైకట్టి ఆశ్రమం కాలినడకన మహారణ్యంలోకి ప్రవేశించి, కోట్టప్పడి దాటి, పేరూరుతోడులో చేపలకు బొరుగులు చల్లి చేరే స్థలం.
3 అళుదా నది పశ్చాత్తాపాన్ని కలిగించే నది. ఇక్కడ స్నానం చేసి, రెండు రాళ్ళను తీసుకోవాలి.
4 అళుదామేడు, కల్లిడుంకుండ్రు అధర్మ ప్రవర్తనను పోగొట్టే ఎక్కుడు. ఆ రెండు రాళ్ళను కల్లిడుంకుండ్రులో విసర్జించాలి.
5 ఇంజిప్పారకోట్ట, ముక్కుళి క్రోధాన్ని నశింపజేసే ఇంజిప్పారకోట్టను దాటి, ముక్కుళి అమ్మవారిని (వనదేవత) దర్శించాలి.
6 కరిమల మెట్టు స్వార్థం, లోభం, వంచన వంటి దుర్గుణాలను దరిచేరనివ్వని కఠినమైన ఎక్కుడు.
7 కరిమల ఇరక్కం, పెరియానవట్టం మనోబలాన్ని కలిగించే దిగుడు. పందళరాజుకు స్వామి దొరికిన పవిత్ర స్థలం పెరియానవట్టంలో తిరువాభరణం పెట్టెలకు జరిగే పూజలో పాల్గొని నమస్కరించాలి.
8 పంబా నది సిరియానవట్టం మీదుగా పంబ చేరి, పవిత్ర పంబలో స్నానం, పంబావిళక్కు (దీపం) విడిచిపెట్టడం, పంబాసద్య (భోజనం), శ్రీ పంబా గణపతి, పందళ రాజు దర్శనం.
9 నీలిమల, అప్పాచిమేడు వైరాగ్యభావాన్ని కలిగించే నిటారైన నీలిమల ఎక్కి, విజయరూపమైన అప్పాచిమేడు వద్ద లోయల్లోని యక్షిణులకు బెల్లపు ఉండలు వేయాలి.
10 శబరి పీఠం శబరి తపస్సు చేసి ముక్తిని పొందిన పుణ్యస్థలం.
11 శరంగుత్తి పవిత్ర వటవృక్షం వద్ద శరం (బాణం), కత్తి వంటి ఆయుధాలను విసర్జించాలి.
12 సన్నిధానం – 18 మెట్లు మానవులలో వ్యాపించియుండే దుర్గుణాలను ఒక్కొక్కటి తొలగించి, వాటి స్థానంలో సద్గుణాలను ఆవాహించే పుణ్యసోపానాలు — పావన పదునెనిమిది మెట్లను ఇరుముడితో ఎక్కి శ్రీ శబరిగిరీశుని దర్శించాలి.
13 కన్నిమూల గణపతి, మాళికాపురత్తమ్మ కన్నిమూల మహాగణపతికి, నాగరాజుకు మొక్కి, మాళికాపురత్తమ్మను దర్శించి, కొబ్బరికాయను గుడి చుట్టూ మూడుసార్లు దొర్లించి విడవాలి — దీనిని “నారికేళ వళిపాడు” అంటారు.
14 భస్మకుళం, నెయ్యాభిషేకం, మకరజ్యోతి భస్మకుళంలో స్నానం చేసి, ఇరుముడి విప్పి, స్వామికి ఆజ్యాభిషేకం (నెయ్యి అభిషేకం) చేయించి, తన్మయత్వంతో మకరజ్యోతిని కన్నులారా గాంచి, శ్రీ ధర్మశాస్తాను శరణు జొచ్చిన జన్మమే పవిత్రమైన జన్మ.

సర్వులు శ్రీ అయ్యప్పస్వామి వారిని దర్శించుకొని సత్ఫలితాలు పొంది తరింతురు గాక! సర్వేషాం మహాజనానాం సమస్త మంగళాని భవంతు. 
ఆధారం: “శ్రీ అయ్యప్పస్వామి పూజా విధానము”.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here