“ఇరుముడి” అంటే రెండు ముడులు గల పవిత్రమైన మూట. ముందు ముడిలో స్వామికి సమర్పించే నెయ్యి టెంకాయ, పూజా ద్రవ్యాలు; వెనుక ముడిలో యాత్రకు కావలసినవి ఉంటాయి. మండల దీక్ష పూర్తి చేసినవారికే ఇరుముడి కట్టుకునే అర్హత ఉంది. ఇరుముడిని తలపై ధరించే 18 మెట్లు ఎక్కాలి.
ఇరుముడి కట్టు :
- యాత్రకు బయలుదేరే రోజు తలస్నానం చేసి, దీక్షా వస్త్రాలు ధరించండి.
- గుడిలో లేదా గురుస్వామి గారి ఇంట్లో గణపతి పూజ, అయ్యప్ప పూజ జరుగుతుంది.
- గురుస్వామి గారు ఇరుముడి మంత్రం పఠిస్తుండగా, మీ చేతులతోనే నెయ్యి టెంకాయలో కాచిన ఆవు నెయ్యి నింపండి, అందరూ శరణు ఘోష చేస్తారు.
- నెయ్యి టెంకాయ, పూజా ద్రవ్యాలను ముందు ముడిలో; ప్రయాణ సామగ్రిని వెనుక ముడిలో ఉంచి ముడులు కడతారు.
- గురుస్వామి గారు ఇరుముడిని మీ శిరస్సుపై ఉంచుతారు; గురుదక్షిణ సమర్పించి నమస్కరించండి.
- ఇరుముడి కట్టిన గుడి ముంగిట శూర టెంకాయ కొట్టి, శరణు ఘోషతో యాత్ర ప్రారంభించండి.
నెయ్యి టెంకాయ (ముద్ర టెంకాయ)
- పెద్దది, గుండ్రంగా ఉన్న ముదిరిన కొబ్బరికాయను ఎంచుకోవాలి.
- పీచు తీసి నున్నగా చేసి, పసుపు రాసి పవిత్రంగా ఉంచాలి.
- ఇరుముడి కట్టేటప్పుడు కొబ్బరికాయలోని మూడు కన్నులలో మెత్తగా ఉన్న కన్ను తెరచి, నీరు తీసి, తడి లేకుండా చేయాలి.
- గురుస్వామి గారు ఇరుముడి మంత్రం చదువుతుండగా, కాచిన ఆవు నెయ్యిని భక్తునిచేతే కొబ్బరికాయలో పోయించి, మూతపెట్టి ఇరుముడిలో ఉంచుతారు.
- ఇరుముడిలో ఉంచే ఈ టెంకాయను “ముద్ర టెంకాయ” లేదా “నెయ్యి కాయ” అంటారు. సన్నిధానంలో ఈ నెయ్యితోనే స్వామికి అభిషేకం జరుగుతుంది.
ఇరుముడిలో ఉంచవలసిన సామగ్రి
ముందు ముడి (మున్ముడి) – స్వామికి సమర్పణ
- నెయ్యి నింపిన ముద్ర టెంకాయ
- కర్పూరం, అగరువత్తులు
- పసుపు, కుంకుమ, గంధం, విభూతి
- తేనె, పన్నీరు
- అటుకులు, పేలాలు (మరమరాలు), బెల్లం, కలకండ, ఎండు ద్రాక్ష
- కొద్దిగా బియ్యం
- తమలపాకులు, వక్కలు, దక్షిణ నాణెం
- మాళికాపురత్తమ్మ వారికి రవికె గుడ్డ, పసుపు, కుంకుమ
వెనుక ముడి (పిన్ముడి) — ప్రయాణానికి
- దారిలో కొట్టవలసిన శూర టెంకాయలు (చిన్న కొబ్బరికాయలు)
- ప్రయాణంలో అవసరమైన బియ్యం, ఆహార పదార్థాలు
సామగ్రి జాబితా ప్రాంతాన్ని, సంప్రదాయాన్ని బట్టి కొద్దిగా మారుతుంది. మీ గురుస్వామి గారు సూచించిన విధంగానే సిద్ధం చేసుకోండి.
ఇరుముడి కట్టు శరణాలు
నెయ్యి నింపుతున్నంత సేపు, ఇరుముడి కడుతున్నంత సేపు గురుస్వామి గారు ఒక పాదం పలికితే భక్తులందరూ రెండవ పాదం బదులుగా పలుకుతారు.
గురుస్వామి గారు ఇరుముడిని శిరస్సుపై ఉంచునపుడు అందరూ మూడుసార్లు పలకాలి :
ఓం శ్రీ స్వామియే — శరణం అయ్యప్ప
స్వామి శరణం — అయ్యప్ప శరణం
పళ్ళిక్కట్టు — శబరిమలక్కు
ఇరుముడికట్టు — శబరిమలక్కు
కట్టుంకట్టు — శబరిమలక్కు
నెయ్యాభిషేకం — స్వామిక్కే
కర్పూరదీపం — స్వామిక్కే
స్వామియే — అయ్యప్పో
అయ్యప్పో — స్వామియే
శూర టెంకాయలు (చిన్న కొబ్బరికాయలు)
ముదిరినవి, గుండ్రంగా ఉన్న చిన్న కొబ్బరికాయలకు పిలక తీసి, నున్నగా చేసి, పసుపు రాసి భద్రంగా ఉంచాలి. వీటిని యాత్రలో ముఖ్యమైన 13 చోట్ల కొట్టాలి – ఆ జాబితా శబరిమల యాత్ర పుటలో ఉంది.
ఇరుముడిని మోసే నియమం
కన్నె అయ్యప్పలు ఎట్టి పరిస్థితిలోనూ ఇరుముడిని తామే క్రిందకు దించరాదు, ఎత్తుకోరాదు. గురుస్వామి గాని, సీనియర్ స్వామి గాని ఇరుముడిని దించడం, ఎత్తడం చేస్తారు. ఇరుముడి కట్టించుకునే వేళ గురుస్వామి గారికి గురుదక్షిణ సమర్పించడం ఆచారం.
ఇరుముడి కట్టే సమయంలో గురుస్వామి గారు ఇరుముడి మంత్రం పఠిస్తుండగా, భక్తుడు కాచిన ఆవు నెయ్యిని ముద్ర టెంకాయలో పోస్తాడు. ఇరుముడి మంత్రం, ఇరుముడిలో ఉంచవలసిన సామగ్రి మీ గురుస్వామి సంప్రదాయం ప్రకారం వారి సమక్షంలోనే సిద్ధం చేసుకోవాలి.



[…] […]
[…] […]
[…] […]