స్నానం, మడి వస్త్రం, బొట్టు, పూజా మందిరం, అష్టదళ పద్మం ముగ్గు, ఆసనం, దీపారాధన – పూజకు ముందు సిద్ధపడే విధానం.
వ్యక్తిగత శుచి
- పూజ చేసే భక్తులు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి.
- దంతధావనం, నిత్యకృత్యాలు నిర్వర్తించి, శుచిగా స్నానం చేసి “మడి వస్త్రం” (ఉతికి ఆరవేసిన వస్త్రం) ధరించాలి.
- ఏకవస్త్రంతో పూజ, జపం, హోమం వంటి వైదిక కార్యాలు చేయరాదు; కౌపీనం లేదా లోపలి వస్త్రం ధరించనిదే మడి వస్త్రం ధరించరాదు.
- సమస్త అమంగళాలు తడిబట్టను ఆశ్రయించి ఉంటాయి కనుక తడిబట్టలు కట్టుకొని పూజ, జపం, ధ్యానం చేయరాదు.
- నుదుట విభూతి, గంధం, కుంకుమ బొట్లు ధరించియే పూజకు సిద్ధం కావాలి.
- ఉపవస్త్రం (పై తువ్వాలు) ధరించకుండా పూజాభిషేకాలు చేయరాదు.
పూజా మందిరం
- పూజగది, పూజా మందిరం అపరిశుభ్రంగా ఉంచరాదు.
- ప్రతినిత్యం పూజా మందిరాన్ని, చిత్రపటాలను శుభ్రపరచి, చందనం అద్ది, కుంకుమ బొట్లు పెట్టి, పుష్పాలతో అలంకరించాలి.
- ఇంటిలో ఈశాన్య మూలను శుద్ధి చేసి, బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి, దైవస్థాపనకు ఒక పీట వేయాలి. పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, దానిపై కూడా వరిపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి.
ఆసనం
ఆసనం లేకుండా పూజ, జపం, ధ్యానం చేయరాదు. వీలును బట్టి జింక చర్మం, పులి చర్మం లేదా దర్భాసనం పై తెల్లని తువ్వాలు వేసి, తూర్పు ముఖంగా సుఖాసనం లేదా పద్మాసనంలో కూర్చోవాలి.
దీపారాధన
- పూజా మందిరానికి ఇరువైపులా రెండు దీపపు కుందులు ఉంచి, రెండేసి వత్తులు వేసి, ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పోసి జ్యోతులు వెలిగించాలి.
- వెలిగించిన జ్యోతులు తూర్పు, ఉత్తర దిక్కులను చూస్తున్నట్లు ఉంచి, అగరువత్తులు వెలిగించి, నమస్కరించిన తరువాత పూజా కార్యక్రమం ప్రారంభించాలి.


