శ్రీ అయ్యప్పస్వామి చాలీసా (తెలుగు)

0

నలభై పద్యాల అయ్యప్ప చాలీసా – ఫలశ్రుతి, మంగళహారతి, శాస్తా గాయత్రులతో.

ఈ చాలీసా తెలుగు భాషలో ఉంది; ఇతర భాషల వారు దీన్ని తమ లిపిలో చదివి పాడుకోవచ్చు. 108 సార్లు శ్రద్ధగా పఠిస్తే స్వామి అనుగ్రహం కలుగుతుందని ఫలశ్రుతి.

చాలీసా

శబరాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన ।
శబరీశ సమో దేవో న భూతో న భవిష్యతి ॥
ఓం నమో శబరిగిరీశాయ నమః ॥

జయ హరిహరసుత జ్ఞాన గుణాకర ।
జయజయ మణికంఠ త్రిలోకపావన ॥ 1 ॥

అవనిని వెలుగగ అవతారముగొని ।
మము బ్రోవగ వచ్చిన శబరిగిరీశా ॥ 2 ॥

ఆనందసాగర అద్భుతరూపా ।
ఆత్మానందము గూర్చే దేవాదిదేవా ॥ 3 ॥

కలికలుషాంతక కాలాతీత ।
కరుణాసింధో కావుము అయ్యప్ప ॥ 4 ॥

బాలంత్వంబునే బలగర్వితుల ।
మదమడగించిన మంగళరూపా ॥ 5 ॥

కపటము తోడను పులిపాలడిగిన ।
రాణికోర్కెను మదిలో తలచి ॥ 6 ॥

కానలకేగి కాంతులు మీరగ ।
పులివాహనమున యేతెంచియు నీ
ప్రతిభను చూపిన స్వామి అయ్యప్ప ॥ 7 ॥

అసుర ప్రవృత్తిని అణచిన దేవా ।
శబరిగిరీశా ఆనందనిలయా ॥ 8 ॥

మోహనరూపా మోహనాశకా ।
శాంతమూర్తి శ్రీ స్వామి అయ్యప్ప ॥ 9 ॥

శక్తి స్వరూపా సద్గుణమూర్తీ ।
శివ కేశవ సుత శ్రీకరమూర్తీ ॥ 10 ॥

బ్రహ్మచర్య వ్రత నిష్ఠను బూని ।
బ్రహ్మము నీవై వెలిగెడి స్వామి ॥ 11 ॥

అల ధన్వంతరిలా యఖిలరోగముల ।
ఆర్తిదీర్చెడి అనాథనాథా ॥ 12 ॥

భవబంధంబుల బాపి లోకముల ।
కరుణించెడివో కళ్యాణరూపా ॥ 13 ॥

సకలము నీవని నామది నమ్మితి ।
నినుపూజించెద కరుణ జూపరా ॥ 14 ॥

పాండ్యరాజును పాలనజేసి ।
పరతత్వంబును తెల్పినస్వామి ॥ 15 ॥

శిష్టజనావళి సంరక్షించుచు ।
దుష్టుల దునిమెడి దురితవినాశా ॥ 16 ॥

త్రిమూర్త్యంశాన దత్తాత్రేయా ।
లీలామానుష స్వామి అయ్యప్ప ॥ 17 ॥

భీకర రణమున మహిషను గూల్చిన ।
హరిహరసుత శ్రీ స్వామి అయ్యప్ప ॥ 18 ॥

శరణు కోరిన భక్తవర్యుల ।
కోరిన కోర్కెల నొసగే స్వామి ॥ 19 ॥

నియమ నిష్ఠల నీతి దప్పక
నిను సేవింపగ వచ్చెడి వారికి ।
వెలుగులు జూపి వెతలను బాపి
విశ్వరూప సుత వినతులు అయ్యప్ప ॥ 20 ॥

వేదనాప్రియ వేదాంత రూప ।
ఆశ్రిత వత్సల భక్త మందార ॥ 21 ॥

నిత్యానందా నిగమ శరీరా ।
నిర్మల హృదయా నిత్యశుభకరా ॥ 22 ॥

మోహినిశంకర లీలాతనయా ।
నీదౌ లీలలు తెలియ తరమా ॥ 23 ॥

భస్మధరా బహు భూతనాయక ।
భవ్య శుభాంగా పాలితలోకా ॥ 24 ॥

మునిజన పూజిత మునిజన రక్షక ।
మోక్ష ప్రదాయక మంగళరూపా ॥ 25 ॥

పరంజ్యోతి పరాత్పరస్వామి ।
పాపవినాశా పాహి అయ్యప్ప ॥ 26 ॥

మదమాత్సర్యము లణచివేయగా ।
మండల దీక్షను భువి నిల్పినమూర్తీ ॥ 27 ॥

త్రిగుణాతీతా త్రిభువన పూజిత ।
సర్వసిద్ధిప్రదా స్వామి అయ్యప్ప ॥ 28 ॥

నీతి నియమములె జాతికి రక్షని ।
ప్రీతితో తెల్పిన ప్రేమ స్వరూప ॥ 29 ॥

పరమతపస్వి పరశురాముడు
పరదైవతమని ప్రతిష్ఠ నిల్పెను ।
భక్తితో నిన్ను స్వామి అయ్యప్ప ॥ 30 ॥

అంధుడు బధిరుడైన గురుపుత్రు
అంధత్వ బధిరత్వ మంతంబుజేసి ।
మహిమ జూపిన ఆర్తశరణ్యా ॥ 31 ॥

మకర జ్యోతి చూచి నీ మహిమ గాంచి
మకర విళక్కు జూచి మదిలోన పొంగి ।
భక్తులెల్లరు బయలుదేరుదురు ॥ 32 ॥

మరు విళక్కును మరచి మందమతులైన ।
జనులెన్నో బాధలన్ చిక్కు కొనెదరు ॥ 33 ॥

పరశురాముడగస్త్య బ్రహ్మఋషులెల్ల ।
నిన్ను అర్చించిరి నీ శక్తినెరిగి ॥ 34 ॥

అర్చించు వారికి ఆనందఫలము ।
సేవించు వారికి సిరిమూటవీవు ॥ 35 ॥

నేతితో ప్రీతితో చేతమ్ము పొంగ ।
అభిషేకము చేయ ఆదరించెదవు ॥ 36 ॥

ధర్మమ్ము సత్యము ధరలోన నిల్ప ।
అవతరించిన స్వామి దేవ అయ్యప్ప ॥ 37 ॥

భక్తి శ్రద్ధలతోడ నీనియమములను
పాటించు భక్తుల కొంగుబంగారం ।
కామితార్థ ప్రదాత కరుణాల వాల ॥ 38 ॥

శబరిమల నివాస శ్రీ దేవదేవు ।
దర్శించు జీవుల ధన్యాత్ము లిలను ॥ 39 ॥

అయ్యప్ప పాదము లాశ్రయించిన ।
యిహపర సౌఖ్యము లింటనేయుండు ॥ 40 ॥

ఫలశ్రుతి

ఎట్టి వారైన శ్రద్ధతో ఎప్పుడైన – నూట ఎనిమిదిసార్లు అనూన భక్తి ।
స్వామి అయ్యప్ప చాలీస పఠన చేయ – అవని భాగ్యాల పొందు అయ్యప్ప సాక్షి ॥

మంగళహారతి

పంచాద్రీశ్వరి మంగళం । హరిహరప్రేమాకృతే మంగళం ।
పింఛాలంకృత మంగళం । ప్రణమతాం చింతామణే మంగళం ।
పంచాస్యధ్వజ మంగళం । త్రిజగతామాద్య ప్రభో మంగళం ।
పంచాస్త్రోపమ మంగళం । శ్రుతిశిరోలంకార సన్మంగళమ్ ॥

ఓం భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి । తన్నః శాస్తా ప్రచోదయాత్ ॥
ఓం తత్పురుషాయ విద్మహే హరిహరపుత్రాయ ధీమహి । తన్నో అయ్యప్ప ప్రచోదయాత్ ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ ఓం తత్సత్ ॥

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here