ప్రతి రోజు పూజకు ముందు, తరువాత పఠించదగిన హృదయపూర్వక ప్రార్థన “అసతో మా సద్గమయ” భావంతో ముగుస్తుంది.
ఈ నిత్య ప్రార్థన తెలుగు గద్యంలో ఉన్న ఆత్మనివేదన. ప్రతి సంబోధనను స్వామికి నేరుగా పలుకుతూ, తరువాతి వాక్యాన్ని మనసారా ప్రార్థించండి.
ప్రార్థన
ఓం శ్రీ అయ్యప్ప పరబ్రహ్మణే నమః
ఓం శ్రీ ధర్మశాస్తా! కరుణా హృదయా! భక్తవత్సలా! కరుణా సముద్రా!
నీకు మా నమస్కృతులు.
ఓ తేజోమయమూర్తీ!
నీవు సచ్చిదానంద స్వరూపుడవు, సర్వవ్యాపివి, సర్వశక్తిమయుడవు, సకలజీవ హృదయాంతర్యామివి.
హే అన్నదాన ప్రభూ!
మాకు శ్రద్ధ, భక్తి, విజ్ఞానములను ప్రసాదించుము. ప్రలోభములను అరికట్టి, చిత్తవృత్తులను నిరోధించుటకు వలయు ఆధ్యాత్మిక శక్తిని అనుగ్రహించుము.
ఓ కరుణామయా!
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఈర్ష్యా, ద్వేష, దురహంకారముల నుండి మమ్ము తప్పించి, భక్తి భావముతో మా హృదయములను నింపుము.
ఓ భక్తహృదయా!
ఎల్లవేళలా నిన్నే స్మరించుచూ, నీ మహిమాదులను కొనియాడుచుందుము గాక! నిరంతరము నీ నామ జపము చేయుచూ, నీ హృదయస్థానమందు మేము శాశ్వతముగా వసింతుము గాక.
ఓ హరిహరపుత్రా! అయ్యప్పస్వామి! కరుణామూర్తీ! సర్వేశ్వరా!
మా చిత్తము సర్వకాల సర్వావస్థలయందును నీ పాదారవిందములయందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడియుండునట్లు అనుగ్రహించుము.
ఓ శబరిమలేశ్వరా! పరమదయానిధీ!
ప్రాతఃకాలమున నిద్రలేచినది మొదలు మరల పరుండు వరకును మనోవాక్కాయ కర్మలచే మా వలన ఎవరికినీ అపకారము కలుగకుండునట్లుగను, సర్వప్రాణికోట్లకు ఉపకారము చేయు సద్బుద్ధిని ప్రసాదించుము.
ఓ ఆపద్బాంధవా! అనాథరక్షకా! అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకా! అయ్యప్పస్వామీ! సచ్చిదానందమూర్తీ! నిర్మలాత్మా!
మా అంతఃకరణమునందు ఎన్నడును ఏవిధమైన దుష్ట సంకల్పము గానీ, విషయ వాసన గానీ, అజ్ఞానవృత్తి గానీ జొరబడకుండునట్లు మమ్ము దయతో అనుగ్రహించుము.
ఓ మహిషీమర్దనా! లోకపూజితా! దయామయా! వేదవేదాంతవేద్యా! అభయ స్వరూపా!
మా యందు భక్తి, జ్ఞాన, వైరాగ్య బీజములంకురించి శీఘ్రముగా ప్రవృద్ధములగునట్లు ఆశీర్వదింపుము. ఈ జన్మము నందే కడతేరి నీ సాన్నిధ్యము నకేతెంచుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో అనుగ్రహింపుము.
ఓ పతితపావనా! పంబాబాలా! జ్యోతి స్వరూపా! మణికంఠ స్వామీ! దేవాదిదేవా!
నీవు భక్తవత్సలుడవు! దీనుల పాలిటి కల్పవృక్షమువు! నీవు తప్పమాకెవరు దిక్కు? నిన్ను ఆశ్రయించితిమి. అసత్తు నుండి సత్తునకు గొనిపొమ్ము! తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము! మృత్యువు నుండి అమృతత్వమును పొందింపజేయుము. ఇదియే మా వినతి అనుగ్రహింపుము, నీదరి చేర్చుకొనుము.
ఓం శ్రీ హరిహరపుత్ర! అయ్యప్పస్వామి! శబరిగిరీశ్వరా!
పాహిమాం! పాహిమాం! పాహిమాం! పాహి! పాహి!
రక్షమాం! రక్షమాం! రక్షమాం! రక్ష! రక్ష! స్వామీ!
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ ఓం తత్ సత్ ॥


