దీక్షా నియమావళి

0

మాల ధరించిన శ్రీ అయ్యప్ప స్వామి భక్తులు దీక్షా సమయంలో పాటించవలసిన నియమ నిబంధనలు ఇవి. ప్రతి నియమం వెనుక శరీర శుద్ధి, మనశ్శుద్ధి, సమానత్వం అనే లక్ష్యాలు ఉన్నాయి. సందేహాలుంటే మీ గురుస్వామి గారి సూచననే అనుసరించండి.

శరీర నియమాలు

నిద్ర నేలమీద కట్ట చాప వేసుకొని, కఠిన దుప్పటి పరచుకొని నిద్రించటం ఉత్తమం. మెత్తని పరుపులు, దిండ్లు వాడరాదు.
బ్రహ్మచర్యం మనోకార్య కర్మలందు బ్రహ్మచర్యాన్ని విధిగా పాటించాలి.
స్నానం ప్రతిరోజు ప్రాతఃకాలం (ఉదయం), సంధ్యా సమయం (సాయంత్రం) చల్లటి నీటితో స్నానం చేయాలి.
బొట్టు అయ్యప్పలు ఎల్లప్పుడూ నుదుట విభూతి, చందనం (గంధం), కుంకుమ బొట్టుతో విలసిల్లుతూ ఉండాలి.
వస్త్రాలు దీక్ష కాలంలో నలుపు రంగు దుస్తులనే ధరించాలి. నీలి రంగు వస్త్రాలు కూడా ధరించవచ్చు.
పూజ ఉదయం, సాయంత్రం స్వామివారికి పూజ జరిపి అయ్యప్ప శరణు ఘోష చేయాలి.
నామస్మరణ సర్వకాల సర్వావస్థలయందు “స్వామియే శరణం అయ్యప్ప” అనే తారక మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.

ఆహార నియమాలు

  • నియమంగా పరిమిత సాత్విక శాకాహారాన్నే “ఏకభుక్తం”గా (ఒంటిపూట భోజనం) తీసుకోవాలి.
  • మధ్యాహ్నం భోజనం, రాత్రులందు అల్పాహారం భుజించాలి.
  • ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులు, మాంసం మొదలైన తామస ఆహారాలు భుజించరాదు.
  • పులుపు, ఉప్పు, కారం వాడకం తగ్గించాలి.
  • తాంబూలం సేవించరాదు.
  • సాధ్యమైనంత వరకు బయట కొన్న ఆహార పదార్థాలు భుజించడం మానుకోవడం మంచిది.

భిక్ష

అయ్యప్ప దృష్టిలో అందరూ సమానులే. కాబట్టి ఎవరైనా భిక్షకు గాని ఫలహారానికి గాని పిలిచినప్పుడు తిరస్కరించక, వర్ణ వర్గ భేదాలు పాటించక తప్పక వెళ్ళాలి.

నిషేధాలు 

  1. పాదరక్షలు (చెప్పులు) ధరించరాదు.
  2. ముఖ క్షౌరం, కేశఖండనం చేసుకోరాదు.
  3. ధూమపానం – చుట్ట, బీడీ, సిగరెట్లు  చేయరాదు.
  4. మత్తు కలిగించే పదార్థాలు, ఖైనీ మొదలైనవి తినరాదు.
  5. మద్యం సేవించరాదు.
  6. అత్తర్లు, సెంట్లు వంటివి వాడరాదు.
  7. గోళ్ళు కొరకడం, తీయడం పనికిరాదు.
  8. జూదం ఆడరాదు.
  9. విందులు, వినోదాలు, వివాహాలు, వివాదాలకు పోరాదు.
  10. లౌకిక వ్యవహారాలకు, దురలవాట్లకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
  11. మల విసర్జనానంతరం శిరస్నానం ఆచరించాలి.

ఆధ్యాత్మికత

  • ప్రతిదినం దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి భగవద్దర్శనం చేయాలి.
  • అర్చనలు, అభిషేకాలు, హోమ యజ్ఞాలు చేయడం మంచిది.
  • తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానం, పురాణ శ్రవణం, సద్గోష్ఠులలో పాల్గొనడం తప్పక ఆచరించాలి.
  • శ్రీమద్భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం వంటి పవిత్ర గ్రంథాలను, సత్పురుషుల చరిత్రలను చదవాలి.
  • సకల జీవరాశులలో భగవంతుడు వెలుగొందుతున్నాడని తలంచాలి.
  • “లోకాః సమస్తాః సుఖినో భవంతు” అని త్రికరణ శుద్ధిగా సంకల్పించాలి.
  • “మానవసేవయే మాధవసేవ”గా భావించాలి.
  • తాను అయ్యప్పనని ప్రతి క్షణం గుర్తుంచుకొని, మాటల్లో చేతల్లో ఆ భావం ఉట్టిపడేలా ప్రవర్తించాలి.
  • తనను స్వామి ప్రతిరూపంగా, ఎదుటివారందరినీ అయ్యప్ప స్వరూపులుగా భావించి గౌరవాదరాలతో పలకరించాలి.

ప్రవర్తన

  • దీక్షా సమయంలో ఆచరించవలసిన నియమ నిబంధనలను గురుస్వామి గారి వద్ద పూర్తిగా తెలుసుకొని విధిగా ఆచరించాలి.
  • గురువులను, తల్లిదండ్రులను, పెద్దలను భక్తిశ్రద్ధలతో గౌరవించి సేవించాలి.
  • మాటల వల్ల గాని, చేతల వల్ల గాని ఎవరికీ ఏ విధమైన కష్టం, బాధ కలిగించరాదు.
  • మంచివారితో స్నేహం చేయాలి.
  • శాంతి, సహనం, కరుణ, ప్రశాంతత, అహింస, క్షమ, సత్యం పలకడం వంటి సద్గుణాలు అలవరచుకోవాలి.
  • త్యాగం చేసే స్వభావం కలిగి ఉండాలి. అసత్యం ఆడరాదు; హింసా కార్యాలు చేయరాదు.
  • శుచి, శుభ్రత ముఖ్యం — భౌతికంగానూ ఆంతరంగికంగానూ పాటించాలి.
  • తన పనులు తానే చేసుకుంటూ, తన వల్ల ఎవరికీ కష్టం కలగకుండా మెలగాలి.
  • సర్వప్రాణుల యందు, భగవద్భక్తుల యందు దయ, ప్రేమ కలిగి ఉండాలి.
  • అహంకారాన్ని విడిచి పెద్దల, తల్లిదండ్రుల, గురువుల యెడ వినమ్రతతో మెలగి, స్వామికి ఆత్మార్పణ చేసుకునే నడవడి కలిగి ఉండాలి.

పిలుపు — ఒకరినొకరు సంబోధించడం

ఎవరిని ఎలా పిలవాలి
ప్రతి వ్యక్తిని స్వామి / అయ్యప్ప
తోటి అయ్యప్పలు కలిసినప్పుడు స్వామి శరణం
స్త్రీలను మాళికా అమ్మ 
బాలికలను కొచ్చుమాళికా అమ్మ
బాలురను మణికంఠ

స్త్రీల విషయంలో

  • దీక్షా సమయంలో స్త్రీలందరినీ (భార్యను సహితం) మాతృస్వరూపిణిగా, దేవతా మూర్తిగా భావించాలి.
  • ఋతుకాలంలో ఉన్న స్త్రీలను చూడరాదు; శవాన్ని చూడరాదు. పొరపాటున చూసినట్లయితే శిరస్నానం చేసి, స్వామివారికి కర్పూర హారతి చూపించి శరణు ఘోష చేయాలి.
  • శబరిమల యాత్ర: సంప్రదాయం ప్రకారం 10 సంవత్సరాల లోపు బాలికలు, 50 సంవత్సరాలు దాటిన స్త్రీలు మాత్రమే యాత్ర చేస్తారు.

సూతకం (మైల)

  • సూతకం ఉన్నచోట్లకు పోరాదు.
  • అపరకర్మలలో పాల్గొనరాదు.
  • మాలాధారణ జరిగిన తరువాత ఎట్టి పరిస్థితిలోనూ జాతకర్మ గాని, పితృకర్మ గాని చేయరాదు.
  • అశుభ సూతకం కలిగి మాల తీయవలసి వస్తే  మాలా విసర్జన పుటలో చెప్పిన విధంగా దగ్గరి దేవాలయంలో తీయాలి.

మాల పవిత్రత, ఇరుముడి

  • మాల ధరించి మండల కాల దీక్షతోనే శబరిమల యాత్ర చేయాలి.
  • కన్నె అయ్యప్పలు ఎట్టి పరిస్థితిలోనూ ఇరుముడిని తామే దించుకోరాదు, ఎత్తుకోరాదు. గురుస్వామి గాని, సీనియర్ స్వామి గాని ఇరుముడిని దించడం, ఎత్తడం చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here