మాల ధరించిన శ్రీ అయ్యప్ప స్వామి భక్తులు దీక్షా సమయంలో పాటించవలసిన నియమ నిబంధనలు ఇవి. ప్రతి నియమం వెనుక శరీర శుద్ధి, మనశ్శుద్ధి, సమానత్వం అనే లక్ష్యాలు ఉన్నాయి. సందేహాలుంటే మీ గురుస్వామి గారి సూచననే అనుసరించండి.
శరీర నియమాలు
| నిద్ర | నేలమీద కట్ట చాప వేసుకొని, కఠిన దుప్పటి పరచుకొని నిద్రించటం ఉత్తమం. మెత్తని పరుపులు, దిండ్లు వాడరాదు. |
| బ్రహ్మచర్యం | మనోకార్య కర్మలందు బ్రహ్మచర్యాన్ని విధిగా పాటించాలి. |
| స్నానం | ప్రతిరోజు ప్రాతఃకాలం (ఉదయం), సంధ్యా సమయం (సాయంత్రం) చల్లటి నీటితో స్నానం చేయాలి. |
| బొట్టు | అయ్యప్పలు ఎల్లప్పుడూ నుదుట విభూతి, చందనం (గంధం), కుంకుమ బొట్టుతో విలసిల్లుతూ ఉండాలి. |
| వస్త్రాలు | దీక్ష కాలంలో నలుపు రంగు దుస్తులనే ధరించాలి. నీలి రంగు వస్త్రాలు కూడా ధరించవచ్చు. |
| పూజ | ఉదయం, సాయంత్రం స్వామివారికి పూజ జరిపి అయ్యప్ప శరణు ఘోష చేయాలి. |
| నామస్మరణ | సర్వకాల సర్వావస్థలయందు “స్వామియే శరణం అయ్యప్ప” అనే తారక మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. |
ఆహార నియమాలు
- నియమంగా పరిమిత సాత్విక శాకాహారాన్నే “ఏకభుక్తం”గా (ఒంటిపూట భోజనం) తీసుకోవాలి.
- మధ్యాహ్నం భోజనం, రాత్రులందు అల్పాహారం భుజించాలి.
- ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులు, మాంసం మొదలైన తామస ఆహారాలు భుజించరాదు.
- పులుపు, ఉప్పు, కారం వాడకం తగ్గించాలి.
- తాంబూలం సేవించరాదు.
- సాధ్యమైనంత వరకు బయట కొన్న ఆహార పదార్థాలు భుజించడం మానుకోవడం మంచిది.
భిక్ష
అయ్యప్ప దృష్టిలో అందరూ సమానులే. కాబట్టి ఎవరైనా భిక్షకు గాని ఫలహారానికి గాని పిలిచినప్పుడు తిరస్కరించక, వర్ణ వర్గ భేదాలు పాటించక తప్పక వెళ్ళాలి.
నిషేధాలు
- పాదరక్షలు (చెప్పులు) ధరించరాదు.
- ముఖ క్షౌరం, కేశఖండనం చేసుకోరాదు.
- ధూమపానం – చుట్ట, బీడీ, సిగరెట్లు చేయరాదు.
- మత్తు కలిగించే పదార్థాలు, ఖైనీ మొదలైనవి తినరాదు.
- మద్యం సేవించరాదు.
- అత్తర్లు, సెంట్లు వంటివి వాడరాదు.
- గోళ్ళు కొరకడం, తీయడం పనికిరాదు.
- జూదం ఆడరాదు.
- విందులు, వినోదాలు, వివాహాలు, వివాదాలకు పోరాదు.
- లౌకిక వ్యవహారాలకు, దురలవాట్లకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
- మల విసర్జనానంతరం శిరస్నానం ఆచరించాలి.
ఆధ్యాత్మికత
- ప్రతిదినం దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి భగవద్దర్శనం చేయాలి.
- అర్చనలు, అభిషేకాలు, హోమ యజ్ఞాలు చేయడం మంచిది.
- తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానం, పురాణ శ్రవణం, సద్గోష్ఠులలో పాల్గొనడం తప్పక ఆచరించాలి.
- శ్రీమద్భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం వంటి పవిత్ర గ్రంథాలను, సత్పురుషుల చరిత్రలను చదవాలి.
- సకల జీవరాశులలో భగవంతుడు వెలుగొందుతున్నాడని తలంచాలి.
- “లోకాః సమస్తాః సుఖినో భవంతు” అని త్రికరణ శుద్ధిగా సంకల్పించాలి.
- “మానవసేవయే మాధవసేవ”గా భావించాలి.
- తాను అయ్యప్పనని ప్రతి క్షణం గుర్తుంచుకొని, మాటల్లో చేతల్లో ఆ భావం ఉట్టిపడేలా ప్రవర్తించాలి.
- తనను స్వామి ప్రతిరూపంగా, ఎదుటివారందరినీ అయ్యప్ప స్వరూపులుగా భావించి గౌరవాదరాలతో పలకరించాలి.
ప్రవర్తన
- దీక్షా సమయంలో ఆచరించవలసిన నియమ నిబంధనలను గురుస్వామి గారి వద్ద పూర్తిగా తెలుసుకొని విధిగా ఆచరించాలి.
- గురువులను, తల్లిదండ్రులను, పెద్దలను భక్తిశ్రద్ధలతో గౌరవించి సేవించాలి.
- మాటల వల్ల గాని, చేతల వల్ల గాని ఎవరికీ ఏ విధమైన కష్టం, బాధ కలిగించరాదు.
- మంచివారితో స్నేహం చేయాలి.
- శాంతి, సహనం, కరుణ, ప్రశాంతత, అహింస, క్షమ, సత్యం పలకడం వంటి సద్గుణాలు అలవరచుకోవాలి.
- త్యాగం చేసే స్వభావం కలిగి ఉండాలి. అసత్యం ఆడరాదు; హింసా కార్యాలు చేయరాదు.
- శుచి, శుభ్రత ముఖ్యం — భౌతికంగానూ ఆంతరంగికంగానూ పాటించాలి.
- తన పనులు తానే చేసుకుంటూ, తన వల్ల ఎవరికీ కష్టం కలగకుండా మెలగాలి.
- సర్వప్రాణుల యందు, భగవద్భక్తుల యందు దయ, ప్రేమ కలిగి ఉండాలి.
- అహంకారాన్ని విడిచి పెద్దల, తల్లిదండ్రుల, గురువుల యెడ వినమ్రతతో మెలగి, స్వామికి ఆత్మార్పణ చేసుకునే నడవడి కలిగి ఉండాలి.
పిలుపు — ఒకరినొకరు సంబోధించడం
| ఎవరిని | ఎలా పిలవాలి |
|---|---|
| ప్రతి వ్యక్తిని | స్వామి / అయ్యప్ప |
| తోటి అయ్యప్పలు కలిసినప్పుడు | స్వామి శరణం |
| స్త్రీలను | మాళికా అమ్మ |
| బాలికలను | కొచ్చుమాళికా అమ్మ |
| బాలురను | మణికంఠ |
స్త్రీల విషయంలో
- దీక్షా సమయంలో స్త్రీలందరినీ (భార్యను సహితం) మాతృస్వరూపిణిగా, దేవతా మూర్తిగా భావించాలి.
- ఋతుకాలంలో ఉన్న స్త్రీలను చూడరాదు; శవాన్ని చూడరాదు. పొరపాటున చూసినట్లయితే శిరస్నానం చేసి, స్వామివారికి కర్పూర హారతి చూపించి శరణు ఘోష చేయాలి.
- శబరిమల యాత్ర: సంప్రదాయం ప్రకారం 10 సంవత్సరాల లోపు బాలికలు, 50 సంవత్సరాలు దాటిన స్త్రీలు మాత్రమే యాత్ర చేస్తారు.
సూతకం (మైల)
- సూతకం ఉన్నచోట్లకు పోరాదు.
- అపరకర్మలలో పాల్గొనరాదు.
- మాలాధారణ జరిగిన తరువాత ఎట్టి పరిస్థితిలోనూ జాతకర్మ గాని, పితృకర్మ గాని చేయరాదు.
- అశుభ సూతకం కలిగి మాల తీయవలసి వస్తే మాలా విసర్జన పుటలో చెప్పిన విధంగా దగ్గరి దేవాలయంలో తీయాలి.
మాల పవిత్రత, ఇరుముడి
- మాల ధరించి మండల కాల దీక్షతోనే శబరిమల యాత్ర చేయాలి.
- కన్నె అయ్యప్పలు ఎట్టి పరిస్థితిలోనూ ఇరుముడిని తామే దించుకోరాదు, ఎత్తుకోరాదు. గురుస్వామి గాని, సీనియర్ స్వామి గాని ఇరుముడిని దించడం, ఎత్తడం చేస్తారు.


