శబరిమల యాత్ర చేయడానికి మాలాధారణ ముఖ్యం. మాల ధరించడానికి ఒక గురువు (మార్గదర్శి) కావాలి. సర్వసద్గుణాలు నిండిన ఉత్తమ గురుస్వామి ద్వారా ముద్రమాలను స్వీకరించి యాత్ర చేయడం ఉత్తమం. మాలాధారణకు ముందు గురుస్వామి గారు మాల ధరించవలసిన భక్తులందరిచే ఈ క్రింది మంత్రాన్ని, ప్రమాణాన్ని పలికిస్తారు.
మాలాధారణ మంత్రం
జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహమ్ ।
వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహమ్ ॥
శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహమ్ ।
శబర్యాశ్రమ సత్యేన ముద్రాం పాతు సదాపి మే ॥
గురుదక్షిణయా పూర్వం తస్యానుగ్రహ కారిణే ।
శరణాగత ముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహమ్ ॥
చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహమ్ ।
శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమో నమః ॥
స్వామియే శరణం అయ్యప్ప ॥
మాలాధారణ ప్రమాణం
మనసా, వాచా, కర్మణా నేను చేసినటువంటి తప్పులు, పొరపాట్లు మన్నించి, స్వామివారి అనుగ్రహంతో శబరిమల చేరి “పదునెనిమిది మెట్లు” ఎక్కి స్వామివారి “తిరుప్పాదము”ను దర్శించి, దర్శన ఫలం సిద్ధించి, తత్ సుఖంతో ఇంటికి చేరి, శేష జీవితకాలం సత్యంతో, ధర్మంతో, స్వామివారిపై అచంచలమైన భక్తితో గడపడానికి అనుగ్రహించవలెనని ప్రార్థిస్తూ “మాల ధరిస్తున్నాను”.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
మాలాధారణ అనంతరం
- మాల ధరించిన నాటి నుండి మాల తీసే వరకు దీక్షలో ఉన్నట్లే లెక్క.
- ఎట్టి పరిస్థితిలోనూ మెడలోని ముద్రమాలను దీక్ష పూర్తయ్యే వరకు తీయరాదు.
- దీక్షామాలను “సర్వసాధారణమైనది”గా ఎంచి ఎవరూ అలక్ష్యం చేయరాదు.
- మాల ధరించిన భక్తులు లోకుల దృష్టిలో మిక్కిలి పునీతులుగా, సాక్షాత్ అయ్యప్పకు సమానులుగా లెక్కించబడతారు.
- మాలాధారణ సమయంలో గురుస్వామి గారికి తాంబూలం, యథాశక్తి దక్షిణ సమర్పించడం ఆచారం.


