ఆత్మవిశ్వాసం, దైవవిశ్వాసం మనిషికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు. జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి నియమాల పథమే అయ్యప్ప దీక్ష. శరణాగతిని అలవరచుకోవడానికి సాధన అవసరం; ఆ సాధనకు అద్భుతమైన మార్గం ఈ దీక్ష.
దీక్షా కాలం
ముద్రమాల ధరించిన భక్తులు మండల కాలం — అంటే 41 రోజులు దీక్షను అతినిష్ఠతో ఆచరించాలి. మండల కాల దీక్ష పూర్తి చేసినవారికే ఇరుముడి కట్టుకునే అర్హత, సన్నిధానం ముంగిట మెట్లుగా పరుండియున్న 18 దేవతలపై కాలు మోపే అర్హత కలుగుతుంది.
దీక్ష యొక్క అంతరార్థం
సన్నిధానం మీద వ్రాసిన మహావాక్యం “తత్త్వమసి” — “అది నీవే”. మాల ధరించిన క్షణం నుంచి భక్తుడు తానే అయ్యప్ప స్వరూపమని, ఎదుటివారందరూ అయ్యప్ప స్వరూపులే అని భావిస్తాడు. అందుకే అయ్యప్పలు ఒకరినొకరు “స్వామి” అని పిలుచుకుంటారు. అయ్యప్ప ఆరాధన అంటే శివకేశవులను, ముక్కోటి దేవతలను సమానత్వంతో ఆరాధించడమే.
దీక్షలో వెలిగే లక్షణాలు
శ్రద్ధాభక్తులతో దీక్ష పూని నియమాలను తు.చ. తప్పక పాటించేవారిలో సదా సంతృప్తి, ప్రశాంతత, ఆనందం, ప్రేమాస్పదమైన చిరునవ్వు వెలుగొందుతాయి — అవే దీక్ష యొక్క ముఖ్య లక్షణాలు. దీక్షను ఎంతవరకు పాటిస్తున్నామన్నదానికి మన అంతరాత్మే సాక్షి. దీక్షను ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయరాదు; కఠినమని తలంచరాదు.
దీక్షా ప్రయాణం – మొదటి నుంచి చివరి వరకు
- గురుస్వామిని ఆశ్రయించడం — గురువు తోడు లేక శబరియాత్ర ఉండదు.
- మాలాధారణ — మాలాధారణ మంత్రం, ప్రమాణం.
- 41 రోజుల నియమావళి మరియు దినచర్య.
- ఉభయ సంధ్యల్లో పూజ, శరణు ఘోష.
- ఇరుముడి కట్టడం — నెయ్యి టెంకాయ.
- శబరిమల యాత్ర — ఎరుమేలి, పంబ, 18 మెట్లు.
- మాలా విసర్జన — గురుదక్షిణ.


